గిరిజనులకు ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన కందుకూరు ఎంఎల్ఏ ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణంలోని ఒకటవ వార్డు ఏకలవ్య నగర్ (ఎస్టీ కాలనీ) లో విద్యాశాఖ సహకారంతో, జిల్లా గిరిజన సంక్షేమశాఖ(ఐటీడీఏ) ఆధ్వర్యంలో, గిరిజనులకు ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనార్ధనకాలనీ ప్రాంతంలో ఎస్టీలకు అనేక సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు లేకపోవడం, దానితో వారు సంక్షేమ పథకాలకు దూరంగా ఉండవలసి వచ్చిన నేపథ్యాన్ని గతంలో ఎన్నికల ప్రచారంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో గుర్తించడం జరిగిందన్నారు. ఇక్కడ నివసిస్తున్న ఎస్టీలు తమకు ఆధార్ కార్డులు ఇప్పించవలసిందిగా తమ దృష్టికి తీసుకువచ్చారు అని దాంతో ఆధార్ అధికృత సెంటర్ ను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. పేదవాడి సమస్యలను తీర్చడమే తమ ప్రధమ ప్రాధాన్యమన్నారు. సిబ్బంది స్థానిక ప్రజల వద్దకే వచ్చి కార్డులు జారీ చేయడం, మంచి కార్యక్రమం అన్నారు. వీటితోపాటు బర్త్ సర్టిఫికెట్లు ఇక్కడే జారీ చేస్తారని ఆయన తెలియజేశారు. ఎస్టీ ప్రజల కష్టసుఖాలు తనకు తెలుసన్నారు. వారి అభ్యున్నతి కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే పట్టణ శివారు ప్రాంతంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అనాది నుండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పని చేసిన పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఆనాడు ఎస్టిలకు స్వర్గీయ ఎన్టీఆర్ పక్కా ఇళ్లను కట్టించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నియోజకవర్గంలోని మండలాల్లో కూడా త్వరలో ఆధార్ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆధార్ కేంద్రంలో బర్త్ సర్టిఫికెట్లు, కొత్త ఆధార్ కార్డుల జారీ, పాత ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్, పేర్లలో తప్పులు సరిచేయడం, బయోమెట్రిక్ అప్డేట్, 5 సంవత్సరాల పిల్లలకు చైల్డ్ ఆధార్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆధార్ నమోదు కేంద్రంలో స్టేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో స్థానిక పేదలకు, ఎస్టీలకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు కూడా అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. సమస్యను తెలియజేసిన వెంటనే, ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయించిన సబ్ కలెక్టర్ కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. సబ్ కలెక్టర్ విద్యాధరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆధార్ అవసరమన్నారు. విద్యార్థుల చదువులకు, స్కాలర్షిప్ లకు, మెడికల్ బిల్లులు, రియంబర్స్మెంట్ కు ఆధార్ సేవలు అవసరమవుతాయన్నారు. ఎమ్మెల్యే సూచన మేరకు ఇక్కడ ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కందుకూరు మున్సిపల్ కమిషనర్ కె.వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ఎర్రవడ్డిపాలెం, తూర్పువడ్డిపాలెం, గుర్రంవారిపాలెం, జనార్ధన కాలనీ సచివాలయాల్లో, ఆధార్ ఎన్ రోల్ మెంట్ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. ఈ సేవలను పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి ప్రజలు తరలివచ్చి ఆధార్ తదితర సేవలను వినియోగించుకున్నారు. కేంద్రం వద్దనే మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య సేవలు అందించారు. కార్యక్రమం అనంతరం రెండు వార్డ్ లో చెరువు అలుగు వాగులో, మూడు రోజుల నుంచి జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఐటీడీఏ పీవో పరిమళ, తహసిల్దార్ చంద్రారెడ్డి, తెదేపా పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

