మాపొలాలకు దారి చూపించండి
BSBNEWS - కందుకూరు
గుడ్లూరు మండలం పూరేటిపల్లి గ్రామ రైతులు తమ పొలాలకు వెళ్ళేందుకు వీలు లేకుండా దారి మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ పొలాలకు దారి చూపించండి అంటూ గనిపినేని వెంకటేశ్వర్లు అనే రైతు సిపిఐ ఆధ్వర్యంలో కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజ కు సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదికలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూరేటిపల్లి గ్రామ సర్వేనెంబర్ లో 283 పొలంలో నుండి పై ఎత్తున ఉన్న రైతులు పండించిన పంటను వారి పొలం లోని దారి గుండా రహదారి మీదకు తీసుకొచ్చేవారు అని, అయితే 283 సర్వే నెంబర్లు భూమిని ఒంగోలుకు చెందిన మాలకొండయ్య కొనుగోలు చేయడం ద్వారా ఆ భూమిలో ఉన్న రాకపోకల దారికి కంచి వేయడంతో పై ఎత్తున ఉన్న రైతులు పంటను రహదారి మీదకు తీసుకురాటానికి ఇబ్బందిగా ఉందని అన్నారు. ఆదివారం రాత్రి గాలితో కూడిన వర్షం రావడంతో పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారని ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు రోడ్డును చూపించవలసిందిగా కోరుతున్నామని ఆయన అన్నారు. గత 40 రోజుల కిందట సబ్ కలెక్టర్ ఇదే విషయమై అర్జీ ఇవ్వటం జరిగిందని గుర్తు చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోయారు. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ స్పందించి మా సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో కందుకూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, పూరేటిపల్లి గ్రామ రైతులు ఉన్నారు.