అధికారుల నిర్లక్ష్యం వలన రైతులు రోడ్డున పడ్డారు దివి శివరాం
BSBNEWS - కందుకూరు
రాళ్లపాడు ప్రాజెక్టు నుండి నీళ్లు రైతులకు అందటం లేదంటే అది కేవలం అధికారులు నిర్లక్ష్యమే అని కందుకూరు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ దివి శివరాం అన్నారు. రైతుల కోసం పనిచేయని అధికారులు ఎవరి కోసం పని చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈరోజు రైతులు రొడ్డేక్కే పరిస్థితి వచ్చిందంటే రైతుల పట్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుందని ఆయన అన్నారు. చేపల మాఫియా కూడా రైతులకు నీళ్లు అందకుండా చేయడంలో భాగస్వాములేనని ఆరోపించారు. రాళ్లపాడు ప్రాజెక్టు అధికారుల నుండి సొసైటీ ద్వారా చేపల పెంపకం ఉంటుందని దాని ద్వారా వచ్చే ఆదాయంలో సగభాగం రాళ్లపాడు ప్రాజెక్టు ఇస్తే రాళ్లపాడు ప్రాజెక్టు కూడా అభివృద్ధి చెంది రైతులకు సమృద్ధిగా నీరు అందించే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు. రైతులకు నీరు అందించేంత వరకు రైతులతో కలిసి మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు.