శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
స్వయంగా బిందెకి నీళ్లు పట్టి మహిళలకు అందించిన ప్రముఖులు
BSBNEWS - ఉలవపాడు
మండలంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని బద్దిపూడి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిర్మించిన సి.సి రోడ్డు, త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలసి స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు నీటి సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్నడు లేని విధంగా మండలంలోని ప్రతి గ్రామానికి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాలలో నీటి సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బద్దిపూడి గ్రామంలో ప్రతి ఇంటికి పైప్ లైన్ తో నీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. కందుకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న ప్రతి గ్రామాన్ని గుర్తించి నీటి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కందుకూరు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
బిందెలతో మహిళలకు నీళ్లు పట్టించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే
బద్దిపూడి గ్రామంలో వాటర్ పైప్ లైన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సమీపంలోని కుళాయి వద్ద కొల్లాయిని ఓపెన్ చేసి మహిళలకు బిందెలతో నీళ్లు పట్టించారు. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, స్థానిక నాయకులు బ్రహ్మానంద రెడ్డి, చేజర్ల వెంకట్రామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సుదర్శి శ్రీనివాసులు మరియు మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
