విద్యుత్ ఉద్యమ అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తాం
- వామపక్ష నాయకుల ప్రతిజ్ఞ
BSBNEWS -KANDUKUR
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు పరిష్కారం కోసం ఆనాడు వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాదు నగరంలో బషీర్బాగ్ వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని జరిగిన పోరాటంలో ప్రభుత్వ దమనకాండకు బలి అయినా అమరులు రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి, మరొకరు ప్రజల కోసం ప్రాణాన్ని త్యాగం చేసి అమరులయ్యారని వారి ఆశయాలను కొనసాగిస్తూ విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని గురువారం సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ప్రతిజ్ఞ చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ప్రజల సమస్యలు మాత్రం మారవని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో ఒకలా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మరోలా వ్యవహరిస్తూ పాలక పక్షాలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ఆనాడు బహిర్బాగ్ ఘటన సమయంలో అప్పటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆ సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని పోరాటం జరిగిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు హయాంలోనే విద్యుత్ చార్జీలు మళ్ళీ పెంచి స్మార్ట్ మీటర్లతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించడం సరికాదన్నారు. ప్రతిపక్ష సమయంలో టిడిపి నాయకులు విద్యుత్తు స్మార్ట్ మీటర్లను పెట్టరాదని పెడితే ప్రజలు తొలగించాలని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి స్మార్ట్ మీటర్లు పెట్టమని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు ప్రయత్నాలు చేయడం సరి కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మేలైన పాలన అందించడం లేదని, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రభుత్వ మద్దతు పలుకుతూ ప్రజల నడ్డి విరిచేలా విద్యుత్ భారాన్ని మోపుతుందని వారు మండిపడ్డారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ చర్యలను ఎల్లవేళలా వామపక్షాలు అడ్డుకుంటాయని, ప్రజల పక్షాన ఉద్యమం చేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, సిపిఎం నాయకులు ఎస్ ఏ గౌస్, నాంచాల, సిపిఐ నాయకులు ఆనందమోహన్, నత్త రామారావు, నత్త రామారావు, దుర్గాప్రసాద్, ఉప్పుటూరి మాధవరావు, ఆదినారాయణ, కోటేశ్వరరావు, బాల బ్రహ్మచారి, ఆరూరి చంద్ర, సిపిఎం నాయకులు రామ్మూర్తి, మాలకొండ రాయుడు, పద్మ, మల్లిక, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.