ఉదయగిరి జిల్లా చేయాలని వినతి
BSBNEWS - ఉదయగిరి
నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలలోని అత్యంత వెనుకబడిన మెట్ట మండలాలను కలిపి ఉదయగిరిని జిల్లాగా ఏర్పాటు చేయాలని మంత్రుల ఉపసంఘాన్ని కోరినట్లు ఉదయగిరి జిల్లా సాధన కమిటీ తెలిపింది. బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణ మంత్రుల ఉపసంఘం సమావేశంలో ఉదయగిరి జిల్లా సాధన కమిటీ నాయకులు పాల్గొని తమ వాదన వినిపించారు. రాష్ట్రంలోనే ఉదయగిరి నియోజకవర్గం అత్యంత వెనకబడివుందని, ఈ ప్రాంతం ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే జిల్లా చేయడం ఒక్కటే మార్గమన్నారు. తద్వారా సత్వర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. వెయ్యేళ్ల మహోన్నత చరిత్రగల ఉదయగిరి ప్రాంతం స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి ప్రభుత్వ నిరాదరణకు గురైందని పేర్కొన్నారు. వ్యవసాయపరంగా పారిశ్రామికంగా ఎంతో వెనకబాటుకు గురైవున్న ఉదయగిరిని జిల్లాగా చేసి ప్రగతిపథం వైపుకు నడిపించాలని వారు మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరారు. స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఉదయగిరి డివిజన్ మంజూరుకు కృషిచేస్తున్నారని వారికి తమ కమిటీ ధన్యవాదాలు తెలుపుతోoదని వారు మంత్రి వర్గ ఉపసంఘం దృష్టికి తెచ్చారు. డివిజన్ ఏర్పాటుతో ఈ ప్రాంత సత్వర అభివృద్ధి సాధ్యపడదన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ఉదయగిరి జిల్లా చేసే విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తామని మంత్రులు పి నారాయణ, సత్యకుమార్ తెలిపారని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిసినవారిలో ఉదయగిరి జిల్లా సాధన కమిటీ నాయకులు షేక్ దస్తగిరి అహమద్, జి. రామిరెడ్డి, రబ్బానీ ఉన్నారు.