విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలి - ఏఐటియుసి
BSBNEWS - KANDUKUR [10/9/24]
విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వై.ఆనంద మోహన్ అన్నారు. స్థానిక కోటారెడ్డిభవన్లో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు మురళి అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని ఈనెల 10వ తేదీ రాస్తారోకో కు పిలుపునివ్వడం జరిగిందని వారు అన్నారు. రాస్తారోకో చేస్తున్న ప్రతి ఏరియాలో పోలీసులు జొరబడి వారిని అరెస్టు చేయటం సరికాదని అన్నారు. ప్రజా హక్కులు కాపాడాల్సిన పోలీసులే హక్కుల కోసం పోరాట కార్మిక సంఘాలకు నోటీసులు ఇవ్వడం సరికాదని వారు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరిని తమ హక్కుల కోసం పోరాటం చేయకుండా పోలీసులను ఉపయోగించి పోరాటాలను అణగదొక్కారని అదే బాటలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేయటం మంచి పద్ధతి కాదని వారు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తూ దేశ ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని వారు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మోడీ చేసిన ప్రజావ్యతిరేక పాలనకు జగన్మోహన్ రెడ్డి ఆమోదించారని దానిని మా ప్రభుత్వం వస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడతామని టిడిపి, జనసేన చెప్పడం జరిగిందన్నారు. వారు చెప్పిన విధంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన అన్నారు. వైసిపి ప్రభుత్వం చేసిన తప్పిదాలే తిరిగి ఈ ప్రభుత్వం చేస్తే ఉద్యమ కార్యాచరణ చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నత్తా రామారావు, కోటేశ్వరరావు, ఉప్పుటూరు మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

