టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడులు మానవత్వానికే కళంకం
- బి.సురేష్ బాబు
BSBNEWS - కందుకూరు
కాశ్మీర్ అందాలను తిలకించేందుకు కాశ్మీర్ లోయకు వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడి మానవత్వానికి కలంకమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి. సురేష్ బాబు అన్నారు. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కుటుంబాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాశ్మీర్ కు వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడి హత్య చేయటం బాధాకర అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్సీ ముందుగానే ఉగ్రవాదుల దాడులు ఉంటాయని హెచ్చరికలు చేసినా భద్రతా లోపం కనిపించటం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇలాంటి ఉగ్రదాడులు భారతదేశంలో మరలా మరలా జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, భారత సమాజమంతా ఉగ్రదాడులను ఏకకంఠంతో ఖండించాలని పిలుపు ఇచ్చారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన కోరారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సిపిఐ నివాళులు అందిస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు యర్రంశెట్టి ఆనందమోహన్, బాల బ్రహ్మచారి, ఉప్పుటూరు మాధవరావు, స్కందపురి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం. రామయ్య తదితరులు పాల్గొన్నారు.

