అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలని
BSBNEWS - KANDUKUR
కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాద్రిపాలెం రైతులు సాగు చేసుకుంటున్న భూముల మధ్య అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలని కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వెంకటాద్రిపాలెం రైతులు బుధవారం నిరసన చేపట్టారు. ముందుగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిలిపివేయాలని వినతి పత్రాన్ని గాంధీ కాళ్ళ ముందు ఉంచి మీరైనా న్యాయం చేయండి అని కోరారు. ఈ సందర్భంగా వెంకటాద్రిపాలెం రైతులు మాట్లాడుతూ రైతులు సాగు చేసుకుంటున్న భూముల మధ్య కొంతమంది వ్యాపారస్థులు మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఈ విషయాన్ని రెవిన్యూ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారు. భూముల వద్దకు వెళ్లే గ్రావిల్ రోడ్డుని కూడా వ్యాపారస్తులు వదలలేదని దీంతో రైతులు పొలాల వద్దకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. సబ్ కలెక్టర్ మా సమస్యలను ఆలకించి మట్టి తవ్వకాల ప్రదేశాలను పరిశీలించి మట్టి తవ్వకాలను నిలిపివేయాలని కోరారు. అప్పటివరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.