పొగాకు గిట్టుబాటు ధర కల్పించే వరకు ఉద్యమానికి అండగా ఉంటాం కె.వీరారెడ్డి
BSBNEWS - కందుకూరు
ఆరుగాలం శ్రమించి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి రైతు సంఘం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే వీరారెడ్డి పిలుపునిచ్చారు. కందుకూరు వేలం కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,సి పి ఐ నాయకుల బృందం సోమవారం సందర్శించి పొగాకు కొనుగోలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టామన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అయన విమర్శించారు. రైతులు పండించిన ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని ఎద్దేవా చేశారు. పొగాకు రైతులు పండించిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకుండా కాలయాపన చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆనాడు వైసిపి ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం దొందు దొందేనన్నారు. పొగాకు పంట పండించిన రైతులు వ్యాపారుల సిండికేట్ దెబ్బకు కుదేలవుతున్నారన్నారు. రైతులు పండించిన పొగాకు గతంలో క్వింటా 36000 పలికిన నేడు 28000 కూడా ఇవ్వటం లేదన్నారు. వ్యాపారుల సిండికేట్ ముసుగులో రైతులను దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సంఘటితమై ఉద్యమాలకు నాంది పలికితేనే ప్రభుత్వాలు దిగివస్తాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పొగాకు పంట కొనుగోలు చేయకుండా చోద్యం చూస్తుందని తెలిపారు. పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయశ్రీ పొగాకు కొనుగోలు పై పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారులు బోర్డు ఉన్నతాధికారులు పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. వేలంకేంద్రంలో రైతులు తెచ్చిన పొగాకు కుంటి సాకులతో వెనక్కి పంపటం దారుణమైన చర్యని అన్నారు నోబిడ్, సి ఆర్ లు పేరుతో తెచ్చిన పొగాకు బెల్లును వెనక్కి పంపిస్తే రైతు ఆ బెల్ ఇంటికి తీసుకెళ్లాలంటే ఎన్నో ప్రయాసలు గురికావాల్సి వస్తుందని తెలిపారు. వ్యాపారులు సిండికేట్ అయ్యి ధరలు పెరగకుండా చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎస్టీసీ ద్వారా కానీ బోర్డు ద్వారా గాని కొనుగోలు జరిపించి రైతులని ఆదుకొని ఈ సంవత్సరం నష్టాల నుంచి కాపాడాలని కోరారు. రైతులకు అండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తుందని తెలిపారు. సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పి మాలకొండయ్య మాట్లాడుతూ రైతులు తెచ్చిన పొగాకును వెనక్కి తీసుకు వెళ్లకుండా పొగాకు వేలంకేంద్రం అధికారులు చూడాలని తెలిపారు. పొగాకు కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతుల పొగాకును గిట్టుబాటు ధరలకు కొనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు సిపిఐ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి పుగాకు రైతుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని వేలం నిర్వహణ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఆనందమోహన్ రైతు నాయకులు వెంకటేశ్వర్లు, సుబ్బారావు, కిరణ్, కోటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.