తహసిల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బంకు స్థాపనకు చర్యలు
అడ్డుకున్న అభివృద్ధి కమిటీ
BSBNEWS - KANDUKUR
స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బంక్ స్థాపించేందుకు శనివారం పనులు చేపట్టగా విషయం తెలుసుకున్న కందుకూరు అభివృద్ధి కమిటీ అడ్డుకొని పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తహసిల్దార్ కార్యాలయావరణంలో 9 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని వాటికి సంబంధించిన ప్రజలు వారి పనుల మీద వస్తుంటారని అటువంటి కార్యాలయాలు వద్ద పెట్రోల్ పంపు నిర్మించడం ఏమిటి అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయంలో వందల సంవత్సరాల చెట్లు ఉన్నాయని వాటిని నరికి పెట్రోల్ బంకు కడతామంటే సహించేది లేదని వారు హెచ్చరించారు. ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా అధికారులు ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ భూములను అప్పగించటం దారుణమని వారు అన్నారు. పెట్రోల్ బంక్ నిర్మించాలని చూస్తే ప్రజలను సేకరించి ఉద్యమ బాట పడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు అభివృద్ధి కమిటీ నాయకులు నేతి మహేశ్వరరావు, తోకల వెంకటేశ్వర్లు, పాలేటి కోటేశ్వరరావు, ముప్పవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.