ఉదయగిరి హత్య కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
BSBNEWS
ఉదయగిరిలోని ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ భాగస్వామ్యానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివాదం ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. గురువారం కావలి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు వివరాలను తెలిపారు. మృతుడు షేక్ హమీద్ (41), నిందితులైన షేక్ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్, షేక్ గుంటుపల్లి మహమ్మద్ ఉమర్‌లు ఉదయగిరిలోని ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ లో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. గత మూడేళ్లుగా ఫంక్షన్ హాల్ భాగస్వామ్యానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో హమీద్‌కు, నిందితులకు మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్నాయని, నెల్లూరు కోర్టులో సివిల్ కేసు కూడా విచారణలో ఉందన్నారు. జూలై 11వ తేదీన హమీద్ తన బావమరిది మరికొందరితో కలిసి ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ కు వెళ్లి తలుపులు లాక్ చేయడానికి ప్రయత్నించాడని ఫంక్షన్ హాల్‌లోని సీసీ కెమెరా ద్వారా హమీద్‌ను గుర్తించిన నిందితులు హనీఫ్, ఉమర్‌లు హమీద్‌ను చంపి ఫంక్షన్ హాల్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలనే దురుద్దేశంతో పథకం పన్నారన్నారు. వెంటనే ద్విచక్ర వాహనంపై ఫంక్షన్ హాల్‌లోకి వెళ్లి నిందితుడు హనీఫ్ వెంట తెచ్చుకున్న కత్తితో ఉమర్ ఇనుప రాడ్డుతో హమీద్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారని తెలిపారు. హనీఫ్ కత్తితో హమీద్ శరీరంపై పలుమార్లు పొడవగా ఉమర్ ఇనుప రాడ్డుతో తలపై, చేతులపై, శరీరంపై తీవ్రంగా కొట్టడం జరిగిందని దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి హమీద్ అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాలతో కావలి డీఎస్పీ పర్యవేక్షణలో ఉదయగిరి సీఐ ఎన్.వెంకట్రావు, ఉదయగిరి ఎస్ఐలు దర్యాప్తు చేపట్టారన్నారు. నిందితులు షేక్ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్, షేక్ గుంటుపల్లి మహమ్మద్ ఉమర్‌లను దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామంలోని హుస్సైని బీఈడీ కళాశాల వద్ద అరెస్టు చేశామని, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, నిందితుల సెల్‌ఫోన్‌లు, నిందితులు ఉపయోగించిన కారు, నేర సమయంలో ధరించిన బట్టలను దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు దర్యాప్తులో నిందితులను పట్టుకోవడంలో సహకరించిన ఉదయగిరి సీఐ, ఎస్ఐ లు, సిబ్బందిని డీఎస్పీ శ్రీధర్ అభినందించారు.