బాలికా సదన్ నిర్వహణ లోపంపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఆకస్మికంగా తనిఖీ...
పిల్లలు ఏ సమస్య ఉన్న తనను సంప్రదించవచ్చు.... కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ..
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని మార్కండేయ స్వామి గుడి వెనుక వైపు ఉన్న బాలికా సదన్ ను స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సదన్ లో ఉన్న చిన్న చిన్న బాలికలు తమ బట్టలను స్వయంగా ఉతుక్కోవడం, పరిసరాలు మురికి చెత్తతో నిండి ఉండడాన్ని చూసి ఇంచార్జ్ వార్డెన్ పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సందర్భంగా బాలికలతో మాట్లాడిన ఎమ్మెల్యే మీకు ఏ సమస్య ఉన్నా నాకు తెలియజేయాలని చెప్పారు. పిల్లలకి అందుతున్న వసతులు, భోజన ప్రమాణాలు, పరిశుభ్రత వంటి అంశాలపై వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. బాలిక సదన్ కు సంబంధించిన రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకోసారి ఇక్కడ ఇలాంటి వాతావరణం పునరావృతం కాకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంత చిన్న వయస్సులో బాలికలే బట్టలు స్వయంగా ఉతుక్కోవటం పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. వార్డెన్ తో పాటు సంబంధిత సిబ్బందిపై సీరియస్ గా స్పందించిన ఆయన, విధులను సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.