ఘన చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ
వలెటివారిపాలెం
భారత కమ్యునిస్టు పార్టీ పేద బడుగు బలహీనవర్గాల పక్షాన నిలబడి పోరాటాలు సాగించి విజయాలు సాధించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని దానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య అన్నారు. మంగళవారం సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వలెటివారిపాలెంలో సిపిఐ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను పక్కనపెట్టి ప్రజలపై అనేక పన్ను భారాలను మోపి వారిని కష్టాల ఊబిలోకి నెట్టేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులన్నిటిని ప్రైవేటుపరం చేసి దేశ చరిత్రలోనే తీరని మచ్చగా బిజెపి ప్రభుత్వం నిలిచిందని ఆయన మండిపడ్డారు. దేశంలో నిత్యవసర సరుకులు ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్కదానితో పాటు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల ధరలను పెంచి రైతుల చావుకు కారకులవుతున్నారు అని ఆయన ఆరోపించారు. కమ్యూనిస్టులు ఉన్న రాష్ట్రాలలో ప్రజలు రైతులు కో అవసరమైన ప్రతి ఒక్క దానిని ఇస్తూ ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్నాయని ఆయన అన్నారు. 2025 నాటికి సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఆనాటికి కమ్యూనిస్టులు బలం పెరుగుతుందని, ఆ దిశగా నాయకులు కార్యకర్తలు వ్యూహరచన చేసుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అరాచకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అరాచకాలను ప్రజలు ఎదుర్కోవాలంటే వారి కి కమ్యూనిస్టుల అండ ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై.ఆనందమోహన్, ఏఐవైఎఫ్ ఉపాధ్యక్షులు కల్వకూరి హరిబాబు, సిపిఐ మండల కార్యదర్శి మర్రి అంజయ్య, నాయకులు సి.హెచ్. రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

