పాకల బీచ్ ఫెస్టివల్ కు తరలిరావాలని నేతల పిలుపు

0

 కందుకూరులో ఉత్సాహంగా 2కె రన్ 


పాకల బీచ్ ఫెస్టివల్ కు తరలిరావాలని నేతల పిలుపు

2కె రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, దామచర్ల సత్య

 కందుకూరు


BSB NEWS


ఈనెల 14, 15 తేదీలలో సింగరాయకొండ మండలం


పాకల వద్ద జరిగే బీచ్ ఫెస్టివల్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పట్టణంలో మంగళవారం 2కె రన్ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ట్ర మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జెడ్పి సీఈవో చిరంజీవి, సబ్ కలెక్టర్ హిమవంశీ, డీఎస్పీ బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ అనూష, ఎంపీడీవో రత్నజ్యోతితో సహా అనేకమంది అధికారులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కాలేజీల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతూ సందడి చేశారు. స్థానిక కోటారెడ్డి హాస్పిటల్ జంక్షన్ నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఈకార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మన కందుకూరుకు దగ్గరలోని పాకల వద్ద ఈనెల 14,15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న బీచ్ ఫెస్టివల్ లో అందరూ పాల్గొనాలని, కుటుంబ సభ్యులతో తరలివచ్చి సంతోషంగా గడపాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వినోదం, ఉల్లాసం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. నిత్యం ఒత్తిడితో, ఉరుకులు పరుగులతో జీవనం సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీచ్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలు ఎంతో ఊరటనిస్తాయని పేర్కొన్నారు. 

మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించబోయే బీచ్ ఫెస్టివల్ లో అనేక వినోద కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బీచ్ అందాలను తిలకించేందుకు హెలికాప్టర్ రైడ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఇంకా ఇతర నాయకుల సహకారంతో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, కందుకూరు చుట్టుపక్కల ప్రజలంతా ఈ వేడుకల్లో పాలుపంచుకోవాలని కోరారు. యువ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సారధ్యంలో కందుకూరు నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా మారబోతోందని ఆయన చెప్పారు. లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు రాబోతున్నాయని అన్నారు. కందుకూరు ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తాయని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. తొలుత కోటారెడ్డి హాస్పిటల్ జంక్షన్ వద్ద, సభా వేదికపై నాయకులు, అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, కూటమి పార్టీ నేతలు, అధికారులు, ప్రైడ్ మీడియా ఈవెంట్స్ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)