మహనీయుల చరిత్రలను విద్యార్థులు తెలుసుకోవాలి - ఎమ్మెల్యే

0

 మహనీయుల చరిత్రలను విద్యార్థులు తెలుసుకోవాలి

పుస్తకావిష్కరణలో కందుకూరు ఎమ్మెల్యే 


BSBNEWS -KANDUKUR

స్వాతంత్ర్య పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సహకరించిన ఫజులుల్లా ఖాన్, షేక్ మదీనా జీవిత విశేషాలను ప్రముఖ చరిత్రకారుడు షేక్ నశీర్ అహ్మద్ పుస్తక రూపంలో తీసుకొచ్చిన సందర్భంలో ముస్లిం డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక టిఆర్ఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో అనేకమంది వీరులు తమ ప్రాణాలు అర్పించారని, అలాంటి వ్యక్తులలో అల్లూరి సీతారామరాజు ముఖ్యుడని అన్నారు. బ్రిటిష్ వారికి సవాల్ విసురుతూ, వారికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి పోరాటాలు చేశారన్నారు. సీతారామరాజుకు ఫజులుల్లా ఖాన్, షేక్ మదీనాలు అండదండలు అందించిన విధానాన్ని పుస్తక రచయిత చక్కగా వివరించారని ప్రశంసించారు. చరిత్రలో మరుగునపడిన అంశాలన్నీ ఇలాంటి రచయితల వల్లే ప్రజలు తెలుసుకోగలుగుతున్నారని అన్నారు. విద్యార్థులందరూ ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ప్రతిరోజు పుస్తకాలను చదవటానికి కొంత సమయం కేటాయించాలని, గురువులు కూడా అందుకు చొరవ తీసుకోవాలని కోరారు. పుస్తకాలు చదవడం వల్ల పరిజ్ఞానం పెరగటంతో పాటు భాషపై పట్టు పెరుగుతుందన్నారు. 

జీవితాలు సక్రమ మార్గంలో నడవడానికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ షేక్ నాగూర్ వలి, ముఖ్య వ్యాఖ్యాత కట్టా సుబ్బారావు, అధ్యాపక అధ్యాపకేతర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)