మహాశివరాత్రికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసాం
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

BSB-NEWS-ఒంగోలు
ఈనెల 15న మహాశివరాత్రి పండుగ సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రముఖ దేవాలయాలు, శైవక్షేత్రాలు వద్ద నిర్వహించే తిరునాళ్ళు, రథోత్సవాలు, ఘాట్లు, తీర ప్రాంతాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ బుధవారం తెలియచేశారు. ప్రముఖ శివాలయాలకు దర్శనానికి, తిరునాళ్ల సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులు, ప్రజలకు ఎటువంటి భద్రతా లేదా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక రూపొందించి, పార్కింగ్ ఏర్పాట్లు సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఆలయ ప్రవేశ మార్గాలు, క్యూ లైన్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శనార్థం వచ్చే ప్రదేశాలలో తొక్కేసలాట, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, అసాంఘిక శక్తులకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు తెలియజేశారు. శివాలయాలు, ఘాట్లు, తీర ప్రాంతాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేరకు ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు, ఎంట్రీ–ఎగ్జిట్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సాంకేతికతను పూర్తిగా వినియోగించుకుంటూ డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ, రెవిన్యూ శాఖల అధికారులు, ఇతర సంబంధిత శాఖల సమన్వయం, సహాయ సహకారాలతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పండగ కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయాలకు వచ్చే భక్తులు పోలీసు శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పండుగ రోజున ప్రజలు ఏదైనా అనుకోని సంఘటనల గురించి సమాచారం తెలిపేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీసుశాఖకు సందర్శకులు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఏమైనా ఉంటే స్థానిక పోలీసు వారికి లేదా 112/100 నంబర్లకు తెలియపరచాలని ఆయన ప్రజలను కోరారు.
