మహా శివరాత్రికి ఏర్పాట్లు సిద్ధం చేయాలి
BSB-NEWS
ఒంగోలు
జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలలో మహా శివరాత్రి సందర్భంగా సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కని దైవ దర్శనం కలిగేలా మహా శివారాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఒంగోలు కలెక్టరేట్లోని విసి హాల్ నుండి జిల్లా కలెక్టర్ రాజబాబు, రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖ అధికారులతో వర్చువల్ గా సమావేశమై ఈ నెల 15న మహా శివారాత్రి సందర్భంగా జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలలో చేపట్టవలసిన మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో మహా శివరాత్రి సందర్భంగా వచ్చే సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఎటువంటి అసౌకర్యం లేకుండా మహా శివారాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలన్నారు. బైరవకొన, త్రిపురాంతకం, రామతీర్దం వంటి ప్రముఖ శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు అవుతారని, అందుకనుగుణంగా దర్శిన క్యూ లైన్లు, తాగునీటి సరఫరా, ఆహారం, పటిష్ట ఏర్పాట్లు, పార్కింగ్, బందోబస్తు, పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు, సీసీ కెమెరాలను ఈ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయడం, క్యూ లైన్ల క్రమబద్దీకరణ, భక్తుల సౌకర్యార్ధం అవసరమైన పీఏ సిస్టం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పి కార్యాలయం నుండి జిల్లా ఎస్పి వి . హర్షవర్ధన్ రాజు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో మహా శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
కలెక్టరేట్ నుండి జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, దేవాదాయ సహాయ కమీషనర్ పానకాల రావు, డిపిఒ వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, క్షేత్ర స్థాయి నుండి రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖ లకు చెందిన డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.
