పాకల బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహిస్తాం

0

 పాకల బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహిస్తాం

మంత్రి స్వామి


BSBNEWS సింగరాయకొండ


రాష్ట్రంలో 100 ప్రముఖ పర్యాటక బీచ్ ల్లో పాకల ఒకటిగా అభివృద్ధి చేయడం జరిగిందని, ఈ నెల 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు పాకల బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.

మండలంలోని పాకల బీచ్ లో ఈ నెల 14, 15 తేదేల్లో జరగనున్న బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఆదివారం ఉదయం మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ లతో కలసి ఏవీ ని విడుదల చేసిన అనంతరం బీచ్ లో పారిశుద్ధ్య పనుల్లో స్వయంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో విశాఖపట్నం బీచ్ మాదిరిగా  అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆ బీచ్ లో వున్న విధంగా పారమిట్ వాల్, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అప్పటి జిల్లా కలెక్టర్ తో చర్చించి నిధులు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 100 ప్రముఖ పర్యాటక బీచ్ ల్లో పాకల బీచ్ ఒకటిగా అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రాంతంగా పాకల బీచ్ ను కూడా గుర్తించి యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పాకల బీచ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రోమో గా వాడుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించే పాకల బీచ్ ఫెస్టివల్ లో హెలికాప్టర్ రైడింగ్, బోట్ రైడింగ్, పారా రైడింగ్, బీచ్ వాలీ బాల్, బీచ్ కబడీ వంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్ వంటివి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ బీచ్ ను అభివృద్ధి చేసిన తర్వాత జిల్లాలోని అన్నీ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడం జరుగుచున్నదన్నారు. గత నెల సంక్రాంతి సమయంలో రోజుకు సుమారు 10 వేల మంది వరకు ఈ పాకల బీచ్ కు రావడం జరిగిందని ఆయన తెలిపారు.  ఈ బీచ్లో బే వాచ్ టవర్  ను ఏర్పాటు చేసి వచ్చే సందర్శకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వలన ఈ సంవత్సరం ఒక్క మరణం కూడా సంభవించలేదని మంత్రి గుర్తు చేశారు. అత్యంత సురక్షిత బీచ్ గా పాకల బీచ్ ను అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాకల బీచ్ ప్రాముఖ్యతను తెలియ చేసే కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావుచే  9వ తేదీ ఒంగోలులో కర్టన్ రైజర్ ప్రోగ్రాం, 10వ తేదిన సంభందిత శాసన సభ్యుల ఆధ్వర్యంలో కందుకూరు, కనిగిరి, పొదిలి లో 2కె రన్ నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. 14వ తేదీ ఉదయంన పాకల బీచ్ ఫెస్టివల్ ను ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. పాకల బీచ్ ఫెస్టివల్ అద్భుతంగా నిర్వహించేలా అన్నీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా ప్రజలు కుటుంబ సమేతంగా ఈ బీచ్ ఫెస్టివల్ కు హాజరై సంతోషంగా గడపాలని ఈ సందర్భంగా మంత్రి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకులు మల్లికార్జున రావు, పర్యాటక శాఖ మేనేజర్ నాంచారయ్య, ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, పాకల గ్రామ సర్పంచ్ శేఖర్, వివిధ శాఖల అధికారులు తదతరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)