వివాదాలు లేకుండా భూ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
స్వర్ణ గ్రామం కార్యాలయ ప్రారంభోత్సవం
274 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ
(ఒంగోలు)
భూ వివాదాలు లేకుండా స్పష్టమైన భూ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా. బాల వీరాంజనేయస్వామి స్వామి పేర్కొన్నారు. శనివారం మండలంలోని శానంపూడి గ్రామంలో మీ భూమి - మీ హక్కు కార్యక్రమం, స్వర్ణ గ్రామం కార్యాలయంను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా.బాల వీరాంజనేయస్వామి, మారిటైమ్ బోర్డు చైర్మెన్ దామచర్ల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
274 పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు శనివారం పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎక్కువ శాతం మంది ప్రజలు రెవిన్యూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేపద్యంలో రెవెన్యూ క్లినిక్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలను తీర్చటానికి ప్రభుత్వం దృడ సంకల్పంతో ఉందన్నారు. గత ప్రభుత్వం ప్రజలకి ఇచ్చే ఇళ్ల స్థలాల హద్దు రాళ్ళ మీద కూడా వాళ్ల ఫోటోలు , పేర్లు వేసుకుని కోట్ల ప్రజా ధనం వృథా చేసిందని ఆయన తెలిపారు. ప్రజల పట్టాదారు పాసు పుస్తకాల మీద కూడా వారి ఫోటోలు వేసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రాజ ముద్రతో నూతన పట్టా దారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. రెవిన్యూకి సంబంధించి తప్పులను కూడా సరి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో కొండపి నియోజకవర్గంలో కూడా రెవెన్యూ క్లినిక్ పెడతామని తెలిపారు. రానున్న రెండు మూడు నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు.ఈ గ్రామంలో త్వరలో 400 కెవి సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరికీ 25 లక్షల వరకు ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా వైద్య సదుపాయం ఉచితంగా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉగాది నుండి కొత్త ఇల్లు మంజూరు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ, దీపం -2 పథకం , ఉచిత బస్సు , తల్లికి వందనం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రతి కుటుంబంలో ఉద్యోగస్తుడు ఉండాలని లేక పారిశ్రామిక వేత్తలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. మారిటైమ్ బోర్డు చైర్మెన్ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాలని పరిష్కరించుకుంటూ ప్రజలకి మేలు చేసేలా ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకి ఇబ్బంది కలిగించే విదంగా ఉందని, మన ప్రభుత్వం వచ్చాక వెంటనే దాన్ని రద్దు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ శాఖ లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. పెన్షన్లు కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా 34 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఈ నెల 14, 15 తేదీలలో పాకల బీచ్ లో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రతి ఒక్కరు కుటుంబంతో హాజరవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్, ఎంపిడివో తదితర అధికారులు పాల్గొన్నారు.
