గురుకులాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు - స్వామి
BSBNEWS - ONGOLE
గురుకులాల్లో మిగిలిపోయిన ఇంటర్మీడియట్ సీట్లు వెంటనే భర్తీ చేయాలి
వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించాలి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
బడుగు బలహీన వర్గాల విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నిలయమైన గురుకులాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
రాష్ట్రవ్యాప్తంగా బాలయోగి గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఇంటర్మీడియట్ సీట్లు వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు.బాలయోగి గురుకుల పాఠశాల అధికారులు, ప్రిన్సిపాల్లతో గురువారం నాడు ఒంగోలులో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో మిగిలి పోయిన ఎంపీసీ, బైపీసీ సీట్లు వెంటనే భర్తీ చేయాలని అవసరమైతే కౌన్సిలింగ్ నిర్వహించాలని అన్నారు. గురుకులాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వసతి గృహాల్లో విద్యార్థులకు లభ్యమవుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. గురుకులాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని త్వరలోనే సోలార్ ద్వారా వేడి నీళ్ల సౌకర్యం కల్పిస్తామని మంత్రి తెలిపారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల బంగారు జీవితాలకు నిలయమైన గురుకులాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోనని మంత్రి అన్నారు.

