శాంతిభద్రతలపై జగన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం - తెదేపా అధికార ప్రతినిధి గోచిపాతల మోషే
శాంతిభద్రతలపై మాట్లాడే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు & హోంమంత్రి అనితకు అభినందనలు
BSBNEWS - కందుకూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు లేవని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే వ్యాఖ్యానించారు. 2019 మే నెల 30వ తేదీ నుండి 2024 జూన్ 11వ తేదీ వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు, వీటన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీమూకలు చేసిన అరాచకాలు గురించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారేమో కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో శాంతిభద్రతలు లేవని మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, జగన్ మోహన్ రెడ్డిని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొడతారని మోషే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆడబిడ్డలకు రక్షణ కరువై భయభ్రాంతులకు గురవుతున్నా ఏనాడు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించని మీరు శాంతి భద్రతలు గురించి మాట్లాడటం వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మోషే ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 - 2024 మధ్యకాలంలో ప్రజాస్వామ్యాన్ని కూనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల్లో రాష్ట్రంలో ఏమూలన అవాంఛనీయ సంఘటన జరిగిన వెంటనే స్పందించి బాధితుల కుటుంబాలకు అండగా నిలవడమే కాకుండా బాధ్యులను శిక్షించే విధంగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , హోంశాఖ మాత్యులు వంగలపూడి అనిత కు మోషే అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటైయిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , హోంశాఖామాత్యులు వంగలపూడి అనిత సారధ్యంలో శాంతిభద్రతలకు కొదువలేదని ప్రజలు మాట్లాడుకుంటుంటే వినటానికి మనసుకురాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మోషే ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడనాడి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వానికి సహకరిస్తే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారని లేనిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి , జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా సమాధికట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దని మోషే మండిపడ్డారు.

