రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలు - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - KANDUKUR
రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ఆధ్వర్యంలో మంగళవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల తహశీల్దార్లతో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రీ సర్వే పేరిట ఒక రైతు పొలం ఇంకొకరికి ఆన్లైన్ చేయడం, పొలం కొలతల్లో మార్పులు వంటి సమస్యల ద్వారా రైతుల్లో గందరగోళం నెలకొందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సమస్య పరిష్కారం దిశగా ఈనెల 23వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగా కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించే గ్రామ సభలలో అధికారులు అందరూ పాల్గొని సభల ద్వారా వచ్చిన అర్జీలను త్వరగతిన పరిష్కరించి రైతులకు మేలు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో ఇద్దరు రైతులు ఒకే సర్వే నెంబర్ తో అసైన్మెంట్ భూమిని కలిగి ఉన్నచో రెవెన్యూ రికార్డులను సక్రమంగా పరిశీలించి నిజమైన భూ హక్కుదారులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని మండలాలలో అసైన్మెంట్ భూములకు సంబంధించిన రిజిస్టర్లు ఈనెల చివరికల్లా మండల రెవెన్యూ కార్యాలయాల్లో రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని సబ్ కలెక్టర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల తహశీల్దార్ లు రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

