రబీ పంటలలో ఉత్తమ యాజమాన్య పద్దతులపై శిక్షణ
BSBNEWS - KANDUKURపట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం లో నెల్లూరు జిల్లా వనరుల కేంద్రం (డి ఆర్ సి)సౌజన్యంతో గ్రామ రైతు సేవా కేంద్రం సిబ్బందికి రబీ పంటలలో ఉత్తమ యాజమాన్య పద్దతులపై శిక్షణ కార్యక్రమాన్ని కందుకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు (ఎ డి ఎ)డాక్టర్ పి. అనసూయ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎ డి ఎ అనసూయ మాట్లాడుతూ రబీ సీజన్లో రైతులకు కావాలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యవసాయ శాఖలో వున్న వివిధ రకాల పథకాలను క్షుణ్ణంగా తెలియజేయడం కోసం ఈ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం యెుక్క ఉద్ధేశం అని తెలియజేసారు. కృషి విజ్ఞాన కేంద్రం కందుకూరు సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ డా. జి. ప్రసాద్ బాబు మాట్లాడుతూ కందుకూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో వున్న రైతు సేవా కేంద్రాల గ్రామ వ్యవసాయ సహాయకులకు మిరప, పొగాకు, వరి, మినుము, శనగ పంటలలో ఉత్తమ యాజమాన్య పద్దతులు, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం మిరప లో నారు నాటడం జరుగుతూవుందని, ఈ సమయంలో ఎకరాకు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫెట్ వేసుకోవాలని తెలిపారు. నారు నాటిన ప్రతి 15 రోజులకు ఒకసారి ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేసుకోవాలని తెలిపారు. రసం పీల్చే పురుగుల నివారణకు మిరప పంట చుట్టూ 4 వరసలు జొన్న వేసుకోవాలని, నారు నాటిన 10 రోజులకు ఏకరాకు 30 పసుపు, 20 నీలం, 20 తెలుపు రంగు జిగురు అట్టలు పెట్టుకోవాలని తెలిపారు. నారు నాటిన 15, 45 రోజులకు ఒకసారి ఎకరాకు ఫిప్రోనీల్ 0.6% గుళికలను 4 కిలోలు వేసుకోవాలని తెలిపారు. మిరప నారు నాటే 2 రోజులముందు పెండిమెతాలిన్ 30% మందును ఎకరాకు 1.5 లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి అని, పొగాకులో ప్రస్తుతం నారుకుల్లు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 2 గ్రాములు లేదా రిడోమిల్ గోల్డ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి నారుమడి తడిచేలాగా మందులు మార్చి మార్చి వారం వ్యవధిలో 3 లేదా 4 సార్లు పిచికారి చేసుకోవాలని తెలిపారు. పొగాకు నారులో ఆకు మచ్చ, బ్లైట్ తెగుళ్ళ నివారణకు కార్బన్దజిమ్ @ 1 గ్రాము లేదా కాబ్రీయోటాప్ 2 గ్రాములు లేదా ప్రోపికొనజోల్ 1 మీ.లీ. లీటరు నీటికి కలిపి ఒకదాని తర్వాత ఒక మందు అవసరాన్ని బట్టి 7 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి అని సూచించారు. నెల్లూరు, జిల్లా వనరుల కేంద్రం (డి.ఆర్ సి. )ఏ.డి.ఏ. లక్ష్మి మాధవి మాట్లాడుతూ గ్రామ వ్యవసాయ సహాయకులు సమర్ధవంతంగా వ్యవసాయ శాఖ పధకాలు అమలుపరుస్తూ వివిద పంటలలో శాస్త్రీయ సాంకేతికతను, ఉత్తమ యాజమాన్య పద్దతులపై నైపుణ్యాలను పెంచుకొని క్షేత్ర స్థాయిలో రైతులకు తెలియజేసి తద్వారా ఖర్చు తగ్గిచ్చి, దిగుబడులు పెంచి రైతుల నిఖర ఆధాయాన్ని పెంపొందించాలని తెలిపారు. రైతు సేవా కేంద్రంలో ప్రతి మంగళ, బుద వారాల్లో పొలంపిలుస్తోంది కార్యక్రమంలో బాగంగా రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి పొలాలను సందర్శించి గుర్తించిన చీడపీడలకు, పోషక లోపాలకు నివారణ మార్గాలను తెలియజేయాలని తెలిపారు. కేవీకే శాస్త్రవేత్త డా.ఐ.వెంకటేష్ చేత వరి, శనగ, మునుము పంటలలో ఉత్తమ యాజమాన్య పద్దతులపై శిక్షణనివ్వడం జరిగిందన్నారు. వరి విత్తనాలను విత్తెముందు కిలో విత్తనానికి 2 గ్రా. కార్బన్దజిమ్ మందును కలిపి నారు పోసుకోవాలని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయ సబ్ డివిజన్ అధికారి వి సునీత, డి దనమ్మ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో బాగంగా రైతులు పాటించవలసిన 9 సూత్రాలైనవి, నేలని 365 రోజులు కప్పి ఉంచడం, నేలని తేలికపాటి పనిముట్ల తో వీలైనంత తక్కువగా దున్నాడం, అవసరమైన చోట ఉత్ప్రేరకాలు గా జీవ ఉత్తేజితాలు (బీజామృతం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం మొదలుగున్నవి ) వాడాలి అని, దేశి /నాటు విత్తనాల వాడకం, 9-18 రకాల పలు పంటలు వేయడం, పశు సంపద (పాడి) ను వ్యవసాయంలో అనుసంధానించడం, ఆచ్చాదన గా, నేలపై సేంద్రీయ అవశేషాలను, పంట వ్యర్ధాలను వాడడం, పురుగు, తెగుళ్ళ యాజమాన్యం కొరకు సమీకృత పురుగులు/తెగుళ్లు యాజమాన్య పద్దతులను(ఐ పి ఎం/ఐ డి ఎం) పాటిస్తూ, చివరి అస్త్రం గా కషాయాలు వాడాలి అని, ఎట్టి పరిస్థితులల్లో కృత్రిమ ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడరాదు అని తెలిపారు. తదుపరి బీజామృతం, ద్రవజీవామృతం, వేప కషాయం తయారీ పై విధాన ప్రదర్శన నిర్వహించి , ఫీల్డ్ లో ఏటిఎం మాడెల్ లో నిరంతర ఆధాయం తీయడం పై శిక్షణ నివ్వడం జరిగింది. డిప్యూటీ గనాంకాధికారి(డిప్యూటీ ఎస్ ఓ)కందుకూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ రబీ సాగు చేసిన పంటలను తప్పనిసరిగా పంట నమోదు చేయాలని, పంట కోత ప్రయోగాలు ఆన్ లైన్ లో చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. జ్యోతి, వివేక్, డా.శ్రీరంగ, మండల వ్యవసాయ అధికారులు వి రాము, హేమంత్ భరత్ కుమార్, వి రవి కుమార్, వి.గీతా కుమారి, టీ ఎ ఓ ,, పీ. లక్ష్మిదుర్గ,ప్రకృతి వ్యవసాయ మాస్టర్ సి హెచ్ రాజ మరియు 5మండలాల గ్రామ వ్యవసాయ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

.jpeg)
