ప్రభుత్వ పరిహారం.. రైతులకు శాపం

0

*ప్రభుత్వ పరిహారం.. రైతులకు శాపం.! 

BSBNEWS - KANDUKUR


జాతీయ రహదారి 167బి విస్తరణలో భాగంగా కందుకూరు- సింగరాయకొండ మధ్యన భూములున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఏ మాత్రం సబబు కాదని దీనిపై పునః పరిశీలన చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజను కలిసి రైతులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్ లో  రూ2 కోట్ల వరకు ఉన్న భూమికి ప్రభుత్వం మార్కెట్ వాల్యూ ప్రకారం రూ28 లక్షలు ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దీనివల్ల ఎంతోమంది రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు ఆందోళన చెందారు. కందుకూరు- సింగరాయకొండ మధ్యన గల 167బి జాతీయ రహదారికి ఇరువైపులా ఇంజనీరింగ్, బీఈడీ కళాశాలలు, యూనివర్సిటీ, గ్రానైట్, తదితర  పరిశ్రమలతో దిన,దినాభివృద్ధి చెందుతున్న ఈ రహదారిలో రైతులకిచ్చే నష్టపరిహారం రైతులను ఆర్థికంగా దెబ్బతీసేలా ఉందన్నారు. ప్రభుత్వ మార్కెట్ వాల్యూ నష్టపరిహారం బహిరంగ మార్కెట్ వాల్యూ కంటే పది రెట్లు  తక్కువగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి కోసం భూసేకరణకు ముందు ఈ భూములలో పలు రకాల పండ్ల తోటలు, ఇతరత్రా పంటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు రైతులు తెలిపారు. రహదారికి ఇరువైపులా భూసేకరణలో ఎంతవరకు రైతులు భూములు కోల్పోతారో నోటీసు కానీ, ఇతరత్రా ఎలాంటి సమాచారం రైతులకు తెలియపరచలేదని చెప్పారు. ఓగూరు గ్రామ సమీపంలోని ఇదే రహదారిలో ఎకరాకు రూ79 లక్షల నష్టపరిహారం రైతులకు ఇచ్చినట్లు వారు గుర్తు చేశారు.  భూమి కోల్పోయిన రైతుల ఆవేదనను పరిగణలోకి తీసుకొని రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు సబ్ కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. స్పందించిన సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ రైతుల విజ్ఞప్తిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇదే సమస్యను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకు రైతులు విన్నవించగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ను కలిసే పని తనకు ఉందని, మీ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం చేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు హామీ ఇచ్చినట్లు బాధిత గ్రామాల రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, ఓగూరు, పలుకూరు, కనుమళ్ల, తదితర గ్రామాలకు చెందిన రైతులు చేబ్రోలు శ్రీనివాసరావు, కె కృష్ణారెడ్డి, ఎస్ వి శ్రావణ సురేఖ, దాచర్ల మల్లికార్జున, కె వరదారెడ్డి, చేబ్రోలు చిన్నమ్మాయి, చేబ్రోలు కోటేశ్వరమ్మ, గంగవరపు వెంకటేశ్వర్లు, కె మల్లికార్జున, సూరం బ్రహ్మయ్య, డి సుబ్బారావు, సుశీల, తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)