నీవేశ స్థలాలకోసం సిపిఐ బి కె ఎం యు ఆందోళన

0

 నీవేశ స్థలాలకోసం సిపిఐ బి కె ఎం యు ఆందోళన 

BSBNEWS- KANDUKUR 


నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ,ఏ పి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. అనంతరం సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీ పరిశీలించి అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి నివేశ స్థలం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల ప్రాథమిక అవసరమైన ఇంటి నిర్మాణ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పోకూరు మాలకొండయ్య, కందుకూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బూసి సురేష్ బాబు లు మాట్లాడుతూ కందుకూరు పట్టణానికి సుదూరంగా మండలంలోని కొండికందుకూరు గ్రామం వద్ద కందుకూరు పట్టణ వాసులకు ఇళ్ల స్థలాలను కేటాయించారని అయితే అక్కడికి వెళ్లేందుకు ఎవరు సుముఖంగా లేరని అన్నారు. జగనన్న ఇచ్చిన చాలీచాలని ఇళ్లల్లో కుటుంబాలు ఉండాలి అంటే సాధ్యమయ్యే పని కాదని వారికి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున స్థలం కేటాయించాలని కోరారు.

ప్రభుత్వం ఇచ్చే ఒక సెంటు స్థలం పేదల నివాసానికి ఏ మాత్రం సరిపోదని భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆనాడే వైసిపి ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతర్ చేయకుండా నాటి ప్రభుత్వం మొండిగా ముందుకెళ్ళిందన్నారు. కాకి లెక్కలతో 32 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాలు పట్ల సుముఖత చూపలేదని, పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం లక్ష ఎనభై వేలు మాత్రమే ప్రకటించారన్నారు. ఆ ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేమని పేదలెవ్వరు కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదని, ప్రస్తుత ప్రభుత్వం అయినా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పేదలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంటి స్థలాల కేటాయింపులు పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూలమేనని, సిమెంట్, ఇటుక, ఇనుము, కంకర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా రు 5 లక్షలకు పెంచి గృహ నిర్మాణం మంజూరు చేయాలని కోరారు. పేదల ఇల్లు నిర్మాణానికి సిమెంటు, ఇసుక, ఇనుము, ఇటుక, కంకర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో, గ్రామాల్లో నివాసయోగ్యంగా గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి గత వైసిపి ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన లేఔట్లను మార్పు చేసి పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించటంతో పాటు రోడ్లు, విద్యుత్తు, త్రాగునీరు, డ్రైనేజీ పారుదల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి పి. బాలకోటయ్య, ఏ ఐ టి యు సి నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కే మురళి, వై ఆనందమోహన్, ఏఐటీయూసీ నాయకులు నత్తా రామారావు, బాల బ్రహ్మచారి, ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు సిహెచ్ దుర్గాప్రసాద్, ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కాకుమాని రవణమ్మ, నాయకులు పులి నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)