కొండముడుసుపాలెంలో పొలం పిలుస్తుంది

0
కొండముడుసుపాలెంలో పొలం పిలుస్తుంది

BSBNEWS - KONDAMUDESEPALEM 

మండలంలోని కొండముడుసుపాలెం, కంచరగుంట గ్రామాలలో మండల వ్యవసాయాధికారి వి. రాము ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ప్రస్తుతం రెండు గ్రామాలలో వరి రకం కెఎన్ఎం1638 నాట్లు వేసుకొనుటకు రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు అని, రైతులు కొన్ని సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. నారుమడిలో పీకే వారం రోజుల ముందు ఉల్లికోడు లేదా కాండం తొలుచు పురుగు ఆశించకుండా 5 సెం.మీ నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యురెన్ గుళికలు చల్లుకోవాలని, 20-25 రోజుల వయస్సు కలిగిన నారును పీకి కుదురుకు 2 లేదా 3 మొక్కలు మాత్రమే నాటుకోవాలని తెలిపారు. చివరి ఆకులు కత్తిరించి లీటర్ నీటికి 2గ్రాముల కార్బన్ డైజిమ్ లేదా 3మి.లీ మోనోక్రోటోఫోస్ లెక్కన ఒక డ్రమ్ము లో 20 నిముషాలు నారు ముంచి నాటుకోవడం వలన  పురుగు, తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చని సూచించారు. చివరి దుక్కిలో ఎకరాకు 20 కేజీల జింక్ సల్ఫేట్, 50 కేజీల యూరియా, 50 కేజీల డి ఎ పి లేదా 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,20 కేజీల మురెట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలని, అవసరానికి మించి యూరియా వాడకూడదని, యూరియా ఎక్కువ వాడకం వలన మొక్క ఏపుగా పెరిగి, చీడ పీడలు, పురుగుల ఉదృతి పెరుగుతుందని తెలిపారు. పిలకలు వేసే దశలో పలుచగా 2 సెం.మీ. నీరు నిల్వ ఉండేవిధంగా చూసుకోవాలని సూచించి, ఉపయోగాలు తెలియజేశారు. రబీ సీజన్లో సాగు చేసిన పంటల వివరాలను పంట నమోదు చేసుకోవాలని, పంటలకు భీమా ( ఇన్సూరెన్స్) చేసుకోవాలని తెలియజేసారు. పశు వైద్యాధికారి డాక్టర్ వై.చెన్న కేశవులు మాట్లాడుతూ ఉపాధిహోమీ పథకం ద్వారా సూపర్ నేపియర్, కోయంబత్తూర్ 5 రకం బహు వార్షిక గడ్డి సాగు చేసుకోవచ్చునని, దానికి రాయితీ కూడా వర్తిస్తుందని, ఆడ దూడలకు వాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ మోడల్ మేకర్ పి మాధవ మాట్లాడుతూ సేంద్రియ పొటాష్ ఎలా తయారు చేయాలో వివరించి వాటి ఉపయోగాలు ఏమిటి తెలియజేసారు. ప్రకృతి వ్యవసాయంలో ఏ టీ ఎం మరియు ఏ గ్రేడ్ మోడల్ గురించి వాటి ఉపయోగాలు తెలియజేసారు. ఈకార్యక్రమంలో మార్కెటింగు సూపర్ వైజర్ షేక్ ఖాసిం, కొండముడుసుపాలెం  గ్రామ ఉద్యాన సహాయకులు ఎల్.రమాదేవి, కంచరగుంట గ్రామ వ్యవసాయ సహాయకులు కె.శరత్ కుమార్, కొండముడుసుపాలెం పశు వైద్య సహాయకులు ఎ.శోభన్ బాబు, కందుకూరు మండల పరిషత్ అధ్యక్షురాలు ఇంటూరి సుశీల, కొండముడుసు పాలెం ఉప సర్పంచ్ పొడపాటి మహేష్, రెండు గ్రామాల పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)