మేలైన వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం.
BSBNEWS - VALETEVARIPALEM
మండలంలో శాఖవరం గ్రామంలో రైతులకు మేలైన వ్యవసాయ సాగు పద్ధతులు పై శిక్షణ కార్యక్రమంను, పొలంబడి ( జి ఏ పి ) మండల వ్యవసాయ అధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ పి అనసూయ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ శాఖవరం గ్రామంలో శనగ పంట సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ, ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం నిర్దేశించిన సాంకేతిక సలహాలతో శనగ పంట సాగు చేయాలని సూచించారు. అలా సాగు చేసి పండించిన ఉత్పత్తులకు స్కోప్ సర్టిఫికెట్ ఇప్పించి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ద్వారా మద్దతు ధర కన్నా 20% అధిక మార్కెట్ ధర కల్పించి ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కలిపిస్తామని తెలియజేశారు. శనగ, మినుము పంటలలో ఉత్తమ యాజమాన్య పద్ధతులను వివరించారు. శనగ పంటలో నేలద్వారా సంక్రమించే ఎండు తెగులు, మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు తెగుళ్లను నివారించడానికి 2కిలోల ట్రైకోడర్మావిరిడె, 2 కిలోల సూడోమోనాస్ జీవ శిలీంద్ర నాశినులను 100 కిలోల పేడ ఎరువులో కలిపి 15 రోజులు నీడలో మగ్గబెట్టి ఎకరా పొలంలో తేమ వున్నపుడు చల్లుకోవాలని తెలిపారు. శనగలో కిలో విత్తనానికి 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలని తెలిపారు. ఎకరాకు 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పెట్, 20 కిలోల యూరియా ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలని తెలిపారు. వరిలో కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండజిమ్ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలని తెలిపారు. అనంతరం శనగలో విత్తన శుద్ధి ప్రదర్శన చేయటం జరిగిందన్నారు. కిలో శనగ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మావిరిడిని విత్తనానికి బాగా పట్టించి ఆరిన తర్వాత భూమిలో ఎద పెట్టుకోవాలని సూచించారు. దీనివల్ల విత్తనం ద్వారా గాని, భూమి ద్వారా గాని ఆశించే ఎండు తెగులు శిలేంద్రం నాశనం అవుతుందని దాని ద్వారా శనగ పంటలో వచ్చే ఎండు తెగులు నివారించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు పి గౌతమి అలాగే గ్రామ రైతులు పాల్గొన్నారు.

