రామాయపట్నం పోర్టు పరిధిలోకి సాలిపేట బిసి కాలనీని చేర్చి నష్టపరిహారం చెల్లించాలి.

0

 రామాయపట్నం పోర్టు పరిధిలోకి సాలిపేట బిసి కాలనీని చేర్చి నష్టపరిహారం చెల్లించాలి. 

గ్రీవెన్స్ సెల్లో సాలిపేట గ్రామస్తులు కలెక్టర్ కు వినతి.

BSBNEWS - NELLORE 

రామాయపట్నం పోర్టు పరిధిలోకి సాలిపేట బీసీ కాలనీ చేర్చి వారికి 2013 చట్టం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని సిఐటియు, పోర్టు నిర్వాసితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ లో నెల్లూరు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద సాలిపేట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి, గోగుల శ్రీనివాసులు, అల్లాడి గోపాల్, కోలగట్ల సురేష్, జి వెంకటేశ్వర్లు, వీరికి సంఘీభావం తెలుపుతూ ప్రసంగించారు. పోర్టు యాజమాన్యానికి లాభాలు తెచ్చి పెడుతూ, పోర్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తుందని అన్నారు. సాలిపేట పంచాయతీ పరిధిలో కర్లపాలెం, సాలిపేట ఎస్టి బీసీ కాలనీలు ఉన్నాయని, కర్లపాలెం, సాలిపేట ఎస్టి కాలనీలను, పోర్టు పరిధిలో చేర్చి వారికి ప్యాకేజీ అమలు చేశారని నాయకులు గుర్తు చేశారు. మధ్యలో ఉన్న సాలిపేట బీసీ కాలనీ సర్వే చేసి పరిహారం ఇవ్వకుండా వదిలివేయడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వ విధానాన్ని దుయ్యబట్టారు. పోరాటం ద్వారా తమ హక్కులు సాధించుకోవాలని వారు నిర్వాసితులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సాలిపేట గ్రామస్తులు మాట్లాడుతూ, సాలిపేటలో ఉన్న సాగు భూమి మొత్తాన్ని పరిశ్రమల కోసం తీసుకుంటున్నారన్నారు. రైల్వే ట్రాక్ కోసం మరికొంత భూమిని తీసుకున్నారన్నారు. ఈ ట్రాక్ వలన 60 ఎకరాలు పట్టాభూమికి నీరు ప్రవహించే సుబ్బయ్య గుంటను పూడ్చుతున్న కారణంగా, పంటలు పండక రైతులు ఈ సంవత్సరం దివాలా తీశారన్నారు. ఇట్టి పరిస్థితుల్లో మేము ఎట్లా బ్రతకాలని కలెక్టర్ కి వారు విన్నవించుకున్నారు. రైల్వే ట్రాక్ నిర్మాణానికి భారీ వాహనాలు ఉపయోగించడం వలన, స్కూలుకు వెళ్లే విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని, భూములు తీసుకొని మా ఇల్లు అక్కడే వేయడం వల్ల, మాకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, పనులు దొరక్క పస్తులతో అల్లాడే పరిస్థితి వస్తుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. మా పశువులు, మేకలు, గొర్రెలు మేపుకోవడానికి అవకాశం ఉండదు అని అన్నారు. మా భూములు కోల్పోయి కూలీలుగా మారిపోతామన్నారు. మాకు పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళతామన్నారు. ఇన్ని ఇబ్బందులతో మేము సతమతమయ్యే కన్నా, మా భూములతో పాటు మా ఇల్లు కూడా తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ కి విన్నవించుకున్నారు. సాలిపేట గ్రామస్తుల గోడును విన్న కలెక్టర్ స్పందిస్తూ వెంటనే కందుకూరు సబ్ కలెక్టర్ చే ఎంక్వైరీ వేయిస్తానని, పరిశీలన అనంతరం మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు, గోగుల శ్రీనివాసులు, అల్లాడి గోపాలు, కోలగట్ల సురేష్, జి వెంకటేశ్వర్లు సాలిపేట గ్రామస్తులు, అట్లా కోటయ్య, కొమరిక కోటయ్య, కొక్కిలిగడ్డ సుబ్రహ్మణ్యం, సన్నె బోయిన శ్రీరామమూర్తి కవర్తపు వాసుదేవరావు, బండారు రామారావు, సన్న బోయిన మాలకొండయ్య, చల్లా వేణు స్వామి, సుధాకర్, రామ్మోహన్ రవి రమేష్ కృష్ణ పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)