ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారించాలి - ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - VALETIVARIPALEM
స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల, పంచాయతీలు వారిగా ఉన్న నిధుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సత్వరం ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని అధికారులను సూచించారు. పంచాయతీ కార్యదర్శులు వారి వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీటి నిర్వహణ ప్రజలకు సక్రమంగా జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, మురుగునీరు ప్రవహించే కాలువల్లో పారిశుద్ధ్య పనులను సత్వరం పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాల్లో మాలిక వసతులైన రోడ్లు, కాలువలు, స్మశాన వాటికల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. మండలంలో రెవిన్యూ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
గత వైసిపి ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేశారని, కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, టిడిపి యువనాయకులు నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రంలోని పంచాయతీలలో అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వచ్చిన ఆరు నెలల్లోనే 1400 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కందుకూరు నియోజకవర్గంలో పంచాయతీల్లో 15 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేసి పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేంద్ర దేవ్, తహశీల్దార్ హమీద్, మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, అన్ని గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమినేతలు తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
