మర్రిపాడు మండలానికి సోమశిల జలాలు - ఆనం

0

మర్రిపాడు మండలానికి సోమశిల జలాలు - ఆనం


BSBNEWS - ఆత్మకూరు

ఆనం సంజీవరెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ ను పూర్తిచేసి మెట్ట ప్రాంతమైన  మర్రిపాడు మండలానికి సోమశిల జలాలు తీసుకొచ్చేందుకు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మర్రిపాడు మండలంలోని పొంగూరు రిజర్వాయర్ ను రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి ఆనం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2026 మార్చిలోగా ఆనం సంజీవరెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ మొదట విడత పనులను పూర్తి చేసి పడమటి నాయుడు పల్లి, పొంగూరు, ఇసుకపల్లి, పెగళ్లపాడు రిజర్వాయర్ పనులను పూర్తి చేసి సోమశిల జలాలను తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.  ఈ ప్రాంతంలో గత పది సంవత్సరాలుగా పనిచేసిన పాలకులు ఈ రిజర్వాయర్ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సోమశిల పర్యటన వచ్చిన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు హై లెవెల్ కెనాల్ పనులకు నిధులను మంజూరు చేసి పనులు ప్రారంభించమని ఆదేశాలు ఇచ్చారని, ఈ సందర్భంగా రైతాంగం తరపున ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుమారు 11 సంవత్సరాల తర్వాత తిరిగి రిజర్వాయర్ పనులను మొదలుపెట్టనుండడంతో ఈ ప్రాంత రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయని, వారి కలను నెరవేర్చెందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. సోమశిల జలాశయం నుంచి ఐదు టీఎంసీల నీటిని పొంగురు రిజర్వాయర్ కు విడుదల చేయాలని రైతులు పదే పదే విజ్ఞప్తి చేశారని, వారి విజ్ఞప్తులన్నీ పరిష్కారమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. గతంలో 1680 కోట్లతో ఆనం సంజీవరెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ ప్రాజెక్టు మంజూరు చేశారని,  60 శాతం పనులు పూర్తయ్యాయని, కొంతమేర భూ సేకరణ కూడా జరిగిందన్నారు. సంక్రాంతి నుంచి పనులను పూర్తిస్థాయిలో మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని స్పష్టం చేశారు. పొంగూరులో 1300 ఎకరాల భూసేకరణలో చాలా వరకు పూర్తయిందని, 283 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే చుక్కల భూములు, ఇతర భూ సమస్యలను పరిష్కరించి భూసేకరణ వేగవంతం చేస్తామన్నారు. అలాగే వెలిగొండ రెండవ టన్నెల్ కూడా పూర్తయితే ఉదయగిరి, ఆత్మకూరు పరిధిలోని సుమారు 44 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందని,  ఏ ఎస్ ఆర్ హై లెవెల్ కెనాల్, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తయితే మెట్ట ప్రాంత ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తొలగి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇది రైతు ప్రభుత్వమని, రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పునరుద్ఘాటించారు. తొలుత ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి భూసేకరణ, నిధులు విడుదల పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ ఈ రాధాకృష్ణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శీనా నాయక్, ఇరిగేషన్ ఈఈలు శ్రీనివాసరావు, ఆర్ వెంకటేశ్వర్లు, డిఈ వెంకటేశ్వర్లు, రైతులు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)