వెలిగొండ ప్రాజెక్టుతోనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి సాధ్యం
ప్రాజెక్టుకు 2000 కోట్ల కేటాయిస్తేనే మొదటి దశ పూర్తి
394 కోట్లు పాత బకాయిలకే సరిపోతాయని ప్రభుత్వంపై మండిపాటు
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ
BSNEWS - యర్రగొండపాలెం
పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం యర్రగొండపాలెం లోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి జి. గురునాథం అధ్యక్షుత సీపీఐ నియోజకవర్గ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ అక్టోబర్ 8వ తేదీన సీపీఐ ఆధ్వర్యంలో మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని, వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామన్నారు. 15వ తేదీన విజయవాడలో ఆర్థిక శాఖ మంత్రి పర్యావుల కేషవ, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో కలిసామన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేను వెంటనే వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వచ్చి అక్కడ పరిస్థితులను పరిశీలించి, ప్రాజెక్టు కావలసిన నిధులు మీద సమీక్షించి చిత్తశుద్ధితో ప్రాజెక్టు పూర్తికి కృషి చేస్తానని సీపీఐ బృందానికి హామీ ఇచ్చారని తెలిపారు. 29వ తారీఖున జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారన్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అధికారులు ఇచ్చారని తెలిపారు. తదనంతరం ప్రవేశపెట్టే బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలని జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు ఇస్తారని ఆశతో ఉన్న సందర్భంలో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా నిరాశకు గురి చేసిందన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులన్నింటికీ 414 కోట్లు కేటాయించారన్నారు. అందులో వెలుగొండ ప్రాజెక్టుకు 394 కోట్లు కేటాయించారని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుకు 394 కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతుందా, ప్రారంభమవుతుందా, ఎందుకు కేటాయించారు అంటే కాంట్రాక్టర్లకు ఉన్న బకాయిలకు కూడా సరిపోని అన్నారు. మంత్రి వెలుగొండ ప్రాజెక్టును నవంబర్ లోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతయా, కావా అని చాలా ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పశ్చిమ ప్రాంత ప్రాణప్రదమైన వెలుగొండ ప్రాజెక్టు గత ప్రభుత్వాలు గత కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురి చేశాయన్నారు. ఈ ప్రభుత్వమైనా పూర్తి చేస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజానీకానికి మొన్న బడ్జెట్లో ప్రాజెక్టుకు 394 కోట్లు కేటాయించడం చాలా బాధాకరమని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు రెండువేల కోట్లు కేటాయిస్తేనే మొదటి దశ పూర్తవుతుందని ఆయన అన్నారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులలో వెలుగొండ ప్రాజెక్టు ప్రధానంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంతో ఆశతో రాష్ట్ర ప్రజలు గెలిపించారని, ప్రజల ఆశలను అడియాశలు చేయకుండా వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కావలసిన నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ టీ5 కాలువను పుల్లలచెరువు వరకు పొడిగించాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కెవి కృష్ణ గౌడ్, సీపీఐ త్రిపురాంతకం మండల కార్యదర్శి బాణాల రామయ్య, రైతు సంఘం నియోజకవర్గ నాయకులు మన్నే సాంబశివరావు, యర్రగొండపాలెం మండల కార్యదర్శి నక్కా తిరుపతయ్య, వై వెంకట శివయ్య, నూర్జహాన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

