ఓగూరు, దివివారిపాలెం గ్రామాలలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్
BSBNEWS - కందుకూరు
మండలంలోని ఓగూరు, దివివారిపాలెం గ్రామాల్లో కెవికె సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డా. జి. ప్రసాద్ బాబు అద్యక్షతన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డా.జి.ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఈ గ్రామాలలో ప్రధానంగా పొగాకు, మినుము, శనగ, కూరగాయల పంటలు పండిస్తున్నారని వాటిలో ఉత్తమ యాజమాన్య పద్దతులు గురించి వివరించారు. పొగాకు, మినుము, శనగ పంటలలో నేల ద్వారా సంక్రమించే నల్లకాడ, వేరుకుళ్ళు, మొదలుకుళ్ళు తెగుళ్ళ నివారణకు ట్రైకోడెర్మ విరిడే, సూడోమోనాస్ అనే రొందు జీవశిలీంద్ర నాశినులను 500 మీ.లీ. చొప్పున 100 కిలోల మగ్గిన పేడ ఎరువులో కలుపుకొని 15 రోజులు నీడలో మగ్గబెట్టి ఎకరా పొలంలో ఆఖరు దుక్కిలో వేసుకోవాలని తెలిపారు. మినుములో ఇమిడాక్లోఫ్రీడ్ 600 ఎఫ్ ఎస్ మందుతో కిలో విత్తనానికి 5 మీ.లీ. కలిపి విత్తనశుద్ది చేసుకోవాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి, దృవీకరణ గురించి రైతులకు వివరించారు. కందుకూరు నిర్కా పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.యం. అనురాధా మాట్లాడుతూ నేల సారవంతత పెంచుకోవడానికి ప్రతి రైతు జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద వంటి పచ్చి రొట్ట పైర్ల విత్తనాలు ఎకరాకు 10 నుండి 15 కిలోలు చల్లుకొని పూత దశలో భూమిలో కలియదున్నుకొని 50 కిలోల ఎస్‌ఎస్‌పి ఎరువును వేసుకోవాలని తెలిపారు. పొగాకులో మల్లె నివారణకు వేసవిలో లోతుదుక్కులు దున్నుకోవాలని, నువ్వుల పంటను పచ్చిరొట్ట పైరుగా వేసి కలియదున్నుకోవాలని, వేపచక్క 200 కిలోలు ఎకరాకు వేసుకోవాలని, శనగ, మినుము, పెసర పంటలతో పంట మార్పిడి చేసుకోవాలని, మల్లె పూతకు రాకముందే తుంచి వెయ్యాలని తెలిపారు. పొగాకు నారులో కలుపు నివారణకు అథారిటీ అనే కొత్త కలుపు మందును విత్తనాలు నాటే 5 రోజులముందు 20గాముల మందును 10 లీటర్ల నీటిలో కలిపి బెడ్డుపై పిచికారి చేసి ఉదయం, సాయంత్రం తడిపెట్టాలని తెలిపారు. అలాగే డ్రోన్ దీదీ అనే కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద స్వయం సహాయ సంఘ మహిళలు 80% సబ్సిడీతో డ్రోన్ తీసుకొని అద్దెకు పిచికారి చేసుకోవడం ద్వారా స్వయం ఉపాది పొందవచ్చునని తెలిపారు. కందుకూరు వ్యవసాయ అధికారి రాము మాట్లాడుతూ రైతులు అన్నదాత సుఖీభవ పథకం కోసం, ఫార్మర్ రిజిస్ట్రీ లో రెజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పథకాల గురించి రైతులకు వివరించారు. హైదారాబాద్ లో వున్న కోళ్ళ పరిశోధనా స్థానం నుండి విచ్చేసిన ప్రధాన శాస్త్రవేత్త డా.కణ్ణన్ మాట్లాడుతూ వనరాజా, గిరిరాజ, గ్రామప్రియ, ఆశీల్ వంటి నూతన అధిక గుడ్లను, మాంసాన్ని ఇచ్చే కోళ్ళ జాతులను తయారు చేశామని వాటిని రైతులు కోళ్ళ పరిశ్రమ పెట్టుకొని ఉపాది పొందవచ్చునని తెలిపారు. అలాగే వాణిజ్య సరలిలో గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళ పెంపకం చేపట్టడం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చునని తెలిపారు. రైతులకు వివిద పంటలలో ఉత్తమ యాజమాన్య పద్దతులపై, కేంద్ర ప్రభుత్వ పథకాలపై తయారు చేసిన పుస్తకాలను అందివ్వడం జరిగింది. ఆత్మా బిటియమ్ కృష్ణ వారి శాఖల కార్యకలాపాలను రైతులకు వివరించారు. దివివారిపాలెంలో మరియొక బృందం కేవీకె శాస్త్రవేత్తలు డా.వెంకటేష్, డా.శ్రీరంగ, నిర్కా శాస్త్రవేత్త గంగాధర్, కలిసి రైతులకు పంటలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు మహిళలు, యువత, ఔత్సాహికులు తదితరులు పాల్గొన్నారు.

.jpeg)