అన్న‌దాత‌కు 9 గంట‌ల నాణ్య‌మైన‌ విద్యుత్ అందిస్తాం

0

 అన్న‌దాత‌కు 9 గంట‌ల నాణ్య‌మైన‌ విద్యుత్ అందిస్తాం

-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్


గిద్దలూరు ఫిబ్రవరి 6:



రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌


ర్యంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి క‌రెంట్ ఛార్జీ పెంచ‌లేద‌ని, ఇక‌పైనా పెంచ‌బోమ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. గిద్దలూరులో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కొమ‌రోలు మండ‌లం క‌సిన‌ప‌ల్లి గ్రామంలో రూ.3.90 కోట్ల‌తో నిర్మించిన 33\11 కేవీ స‌బ్ స్టేష‌న్ ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు ఆదేశాల‌కు అనుగుణంగా లో ఓల్టేజ్, విద్యుత్ అంత‌రాయాల స‌మ‌స్య ప‌రిష్కారానికే స‌బ్ స్టేష‌న్ల నిర్మాణం చేప‌ట్టామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 స‌బ్ స్టేష‌న్ల నిర్మాణం చేస్తున్నామ‌న్నారు. ఆర్డీఎస్ఎస్ ప‌థ‌కాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్డీఎస్ఎస్ ప‌థ‌కంతో ఫీడర్ లెవల్ బైఫరికేషన్ చేపట్టామని పేర్కొన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ 24 గంట‌లూ విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డంతో పాటు వ్య‌వ‌సాయానికి నిరంత‌రాయంగా 9 గంట‌ల నాణ్య‌మైన‌ విద్యుత్ ను అందించే వెసులుబాటు క‌లుగుతుంద‌న్నారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ఆర్డీఎస్ఎస్ ప‌థ‌కంలో భాగంగా రూ.650 కోట్ల‌తో ఫీడ‌ర్ లెవ‌ల్ బైఫ‌ర్కేష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. ఇందులో ఇప్ప‌టికే 68 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌న్నారు. ఆర్డీఎస్ఎస్ ప‌నులు జరిగే ప్రాంతంలో విద్యుత్ అంత‌రాయాల వ‌ల్ల కొంత అసౌక‌ర్యం క‌లుగుతుంద‌ని, ప‌థ‌కం వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలను వివ‌రిస్తూ అధికారులే ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల దృష్టికి తీసుకెళ్లాల‌ని సూచించారు. గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఓల్టేజ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఇంకా ఐదు స‌బ్ స్టేష‌న్లు అవ‌స‌రం అని స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి త‌న దృష్టికి తీసుకొచ్చార‌ని మంత్రి తెలిపారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుని ప్రాధాన్య‌తా క్ర‌మంలో అన్ని పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. మార్కాపురం, క‌నిగిరి ప్రాంతాల్లో రిల‌య‌న్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న గ్యాస్ ప్లాంట్ వంటి సంస్థ‌ను గిద్ద‌లూరు ప్రాంతంలోనూ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామ‌న్నారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అడిగిన రెవెన్యూ డివిజ‌న్ పై  కూడా సీఎం సానుకూలంగా స్పందించార‌ని మంత్రి వివ‌రించారు.


రూ.7000 కోట్ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా ప‌నులు


రాబోయే రోజుల్లో ఒక్క రూపాయి బిల్లు పెంచ‌కుండా నాణ్య‌మైన విద్యుత్ ను ప్ర‌జ‌ల‌కు అందించాల‌న్న‌దే కూట‌మి ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని మంత్రి గొట్టిపాటి వెల్ల‌డించారు. దానికి అవ‌స‌రం అయిన 132, 220, 400 కేవీ వంటి స‌బ్ స్టేష‌న్ల‌తో పాటు ప‌వ‌ర్ లైన్ ప‌నుల‌ను రాష్ట్ర‌ వ్యాప్తంగా సుమారు రూ.7 వేల కోట్ల‌తో చేప‌ట్టామ‌న్నారు. ఒక్క గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోనే రూ.90 కోట్ల‌తో ఆర్డీఎస్ఎస్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఇందులో రూ.70 కోట్ల ప‌నులు ఇప్ప‌టికే పూర్త‌య్యాయ‌న్నారు. ఆర్డీఎస్ఎస్ నిధుల‌తో ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేస్తే కేంద్ర ప్ర‌భుత్వాన్ని మ‌రిన్ని నిధులు కోరే అవ‌కాశం ఉంటుంద‌ని, అధికారులు ఆ దిశ‌గా ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని మంత్రి సూచించారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా, ఎవ‌రూ చేయ‌ని విధంగా 13 పైస‌లు ట్రూ డౌన్ చేశామ‌న్నారు. దీనితో పాటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ట్రూ అప్ చేసిన 40 పైస‌ల‌ను పూర్తిగా డౌన్ చేయ‌డంతో పాటు,  రాబోయే రోజుల్లో ఒక్కో యూనిట్ పై రూ.1.19 పైస‌లు త‌గ్గించే దిశ‌గా ప‌ని చేస్తున్నామ‌న్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో అధిక ధ‌ర‌ల‌కు విద్యుత్ కొనుగోళ్లు చేసి ప్ర‌జ‌ల‌పై రూ.30 వేల కోట్ల భారం వేశార‌న్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీల‌ను పెంచార‌ని విమ‌ర్శించారు.


సూర్య‌ఘ‌ర్ తో 30 ఏళ్ల ల‌బ్ధి


కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో  అమ‌ల‌వుతున్న‌ పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కాన్ని అంద‌రూ వినియోగించుకోవాల‌ని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కాన్ని వినియోగించుకునే ల‌బ్ధిదారుల‌కు రూ.78 వేల ప్ర‌భుత్వ స‌బ్సిడీ ఉంటుంద‌ని వివ‌రించారు. ఎస్సీ, ఎస్టీ వినియోగ‌దారుల‌కు పూర్తి ఉచితంగా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం ద్వారా సోలార్ ప్యాన‌ల్స్ ను ఇంటిపై ఏర్పాటు చేసుకుంటే సుమారు 30 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ల‌బ్ధి క‌లుగుతుంద‌న్నారు. ఎక్కువ సోలార్ విద్యుత్ ను ఉత్ప‌త్తి చేస్తే అద‌న‌పు లాభం కూడా క‌లుగుతుంద‌ని మంత్రి గొట్టిపాటి వివ‌రించారు. రాష్ట్రంలోని ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో 10 వేల మంది గృహ వినియోగ‌దారులు సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంలో భాగం అయ్యే వెసులుబాటు ఉంద‌న్నారు. పీఎం కుసుమ్ తో రైతుల‌కూ సోలార్ విద్యుత్ అందిస్తామ‌న్నారు.


132\33 కేవీ స‌బ్ స్టేష‌న్ ను ప‌రిశీలించిన మంత్రి గొట్టిపాటి


మార్కాపురం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గిద్ద‌లూరులో ఉన్న 132\33 కేవీ స‌బ్ స్టేష‌న్ ను మంత్రి గొట్టిపాటి సంద‌ర్శించారు. స‌బ్ స్టేష‌న్ ప‌నితీరు, విద్యుత్ లోడు వివరాలను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం విద్యుత్ శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గిద్ద‌లూరులో 220 కేవీ స‌బ్ స్టేష‌న్ తో పాటు డివిజ‌న‌ల్ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌న్న స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విజ్ఞ‌ప్తికి మంత్రి గొట్టిపాటి సానుకూలంగా స్పందించారు. స‌బ్ స్టేష‌న్ల‌పై లోడ్ ప‌డ‌కుండా అవ‌స‌ర‌మైన చోట నూత‌న స‌బ్ స్టేష‌న్ల నిర్మాణాల‌కు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని స్థానిక అధికారులకు  సూచించారు. 220 కేవీ స‌బ్ స్టేష‌న్, డివిజ‌న‌ల్ ఆఫీస్ కు సంబంధించి డీపీఆర్ లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈకార్య‌క్ర‌మంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)