పాకల బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలి
- పాకాల బీచ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి
BSBNEWS మార్కాపురం/గిద్దలూరు ఫిబ్రవరి 6 :
పర్యాటకం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ టూరిజం, మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పాకాలలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ పోస్టర్‌ను శుక్రవారం గిద్దలూరులో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ఇప్పటికే చీరాల, సూర్యలంక బీచ్‌ల తరహాలో పాకాల బీచ్‌ను కూడా అభివృద్ధి చేస్తే వెనుకబడిన ప్రకాశం జిల్లా మరింత ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో టూరిజం రంగం అతిపెద్ద ఉపాధి కల్పించే రంగంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. టూరిజం ద్వారా లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను స్థానిక యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాకాల బీచ్‌ను ముందుగా స్థానికులే ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రజలు పాకాల బీచ్ ఫెస్టివల్ జరిగే రెండు రోజులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో ఎంజాయ్ చేయాలని కోరారు. చీరాల, సూర్యలంక బీచ్‌ల పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం సుమారు 1100 రూములు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పాకాల బీచ్‌ను కూడా అభివృద్ధి చేసి పర్యాటకులకు అనుకూలంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకు స్థానికుల సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. పాకాల బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, టూరిజం శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
