అంగన్వాడిలు చిన్నారుల సమగ్ర ఎదుగుదలే లక్ష్యంగా పనిచేయాలి
జిల్లా కలెక్టర్
BSBNEWS ఒంగోలు
అంగన్వాడిలలోని చిన్నారుల సమగ్ర ఎదుగుదలే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా దృష్టి సారించాలని సి.డి.పి.ఓ.లకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరుపై మంగళవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. వయసుకు తగినట్లుగా పిల్లల బరువు, ఎదుగుదల ఉండాలన్నారు. పోషకాహార లోపం, ఎత్తు తక్కువ, బరువు తక్కువ ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఇలాంటి పిల్లలు ఉన్న అంగన్వాడి కేంద్రాలతో పాటు సూపర్వైజర్లు లేని ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలపైనా సిడిపిఓలు మరింత దృష్టి సారిచాలని కలెక్టర్ ఆదేశించారు. నెల రోజుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మంచి ఆహారాన్ని ఎన్.ఆర్.సీ.లో కాకుండా స్థానిక అంగన్వాడీ కేంద్రాలు, లేదా చిన్నారుల ఇంటి వద్దే అందించేందుకు ప్రభుత్వపరంగా ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆయన చెప్పారు. ఈ విధంగా బాధపడుతున్న చిన్నారులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సి.ఎస్.ఆర్ ) ద్వారా సహాయం లభించేలా తాను కూడా చర్యలు తీసుకుంటానన్నారు. సి.డి.పి.వో.లు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అంగన్వాడి సిబ్బందిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, ఐ.సి.డి.ఎస్. పి.డి. మాధురి తదితరులు పాల్గొన్నారు.
