పొగాకు తోటలను పరిశీలించిన క్షేత్ర మిత్ర బృందం
BSBNEWS - kandukur
2025-26 పంటకాలానికి పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఒంగోలు, కందుకూరు - 2 పొగాకు బోర్డు వేలం కేంద్రం వారి ఆధ్వర్యంలో పొగాకు కంపెనీల ప్రతినిధులతో కలిసి క్షేత్ర మిత్ర బృందంగా ఏర్పడి కందుకూరు-II పొగాకు బోర్డు వేలం కేంద్రం పరిధిలోని గ్రామాలలో పర్యటించి పొగాకు రైతులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను తెలుసుకొని తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ముందుగా బోర్డు అధికారులు, కంపెనీ ప్రతినిధులు రామ చంద్రపురం, ఓలేటి వారిపాలెం, పోలినేని పాలెం గ్రామాల రైతులతో కలిసి పొగాకు తోటలును, బ్యారెనులు, క్యూరింగులు గ్రేడింగులు, పరిశీలించారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి జి.చంద్రశేఖర్ పొగాకు రైతులకు పొగాకు సాగులో తీసుకోవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివరించారు. పక్వానికి వచ్చిన ఆకులు మాత్రమే రెలుపులు చెయ్యాలన్నారు. ఇంకా క్యూరింగ్ చేయనప్పుడు తగిన సంఖ్యలో మాత్రమే పొగాకు కర్రలను బ్యారెన్ లో ఎక్కించవలెనని, బ్యారెన్ లు అగ్ని ప్రమాదాలు జరగకుండా గొట్టములపై ఇనుప జల్లడలను ఏర్పాటు చేసికొనవలెనని, క్యూరింగ్ వారిగా మండేలు వేసుకొనవలెనని, మండేలను నాణ్యత దెబ్బతినకుండా తిరగ వేసుకొనవలెనని తెలిపారు. క్యూరింగ్ చేయనప్పుడు బ్యారన్ లో క్యూరోమీటర్ అమర్చుట ద్వారా ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పొగాకు రంగు కాపాడుకోవచ్చునని తెలిపారు.
బ్యారన్ లో క్యూరింగ్ చేసేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే ఆలస్యం కాకుండా పొగాకు బోర్డుకు సమాచారం అందించాలని, తద్వారా ఇన్సూరెన్స్ వాళ్లకు తెలియపరిచి రైతుకు న్యాయం చేస్తామన్నారు. టార్పాలిన్ పట్టలను వాడుట ద్వారా క్షేత్రస్థాయిలో పొగాకేతర అన్యపదార్థాలను కలవకుండా నివారించవచ్చునని తెలిపారు. పొగాకు రైతులు అందరూ మంచిగా గ్రేడింగ్ చేసేటప్పుడు అన్య పదార్థాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ సంవత్సరం పొగాకు తోటలలో పొగాకు మల్లె ఉందని దానిని పూత వచ్చి విత్తనం ఏర్పడక ముందునే పీకి కాల్చి వేయడం ద్వారా పొగాకు మల్లె ను నివారించవచ్చునని తెలిపారు. వరుసుగా జనుము, నువ్వులు మొదలైన పంటలు వేయటం ద్వారా పొగాకు మల్లెను నివారించవచ్చునని తెలిపారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకుకూలించడం వలన పొగాకు తోటల్లో పేను బంక వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేయించుకునే వాళ్ళు బోర్డు దగ్గరికి వచ్చి బోర్డు క్షేత్ర సహాయాధికారి లేదా బోర్డు క్షేత్రాధికారికి తెలియపరచి అనుమతి తీసుకోవాలన్నారు. పొగాకు పొలాలు, క్యూరింగ్, గ్రేడింగ్ లు పరిశీలించి తగు సూచనలు, జాగ్రత్త లు తీసుకోవాల్సిందిగా రైతులకు తెలిపినారు. ఈ కార్యక్రమంలో (ఎస్ ఎల్ ఎస్) ఒంగోలు ప్రాంతీయ అధికారి ఎస్. రామారావు, ఎస్ జీవో కే రాజగోపాల్, జి.పి.ఐ మేనేజర్ ఉన్నం.శ్రీనివాసులు, ఐటీసీ మేనేజర్ ఎం. వెంకట రావు, మేనేజర్, పోలిశెట్టి ఎ. రామాంజనేయులు, పొగాకు బోర్డు సిబ్బంది, రామచంద్ర పురం, వలేటివారిపాలెం, పోలినేనిపాలెం, గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
