హరితాంధ్రప్రదేశ్ సాధనలో ఎవరి పాత్ర వారు పోషించారు

0

 హరితాంధ్రప్రదేశ్ సాధనలో ఎవరి పాత్ర వారు పోషించారు 

జిల్లా కలెక్టర్


BSBNEWS - ఒంగోలు


హరితాంధ్రప్రదేశ్ సాధనలో ప్రజలు, సంబంధిత ప్రభుత్వ శాఖలు చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ఈ దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంపుపై గురువారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి ( సోషల్ ) రాజశేఖర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని విధాలుగా అభివృద్ధి సాధించేలా స్వర్ణాంధ్ర - 2047 ప్రణాళికలో అడవుల పెంపకం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఇరిగేషన్, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ - గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్, విద్య, గిరిజన, పరిశ్రమలు శాఖలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థలను భాగస్వాములను చేస్తూ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సగటున ప్రస్తుతం 30 శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 2030 నాటికి 37 శాతానికి, 2047 నాటికి 50 శాతానికి పెంచాలన్నది లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అటవీ విస్తీర్ణం 37% ఉందన్నారు. దీనికి 2030 నాటికి మరో ఏడు శాతం జోడించాల్సి ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు సంబంధిత శాఖల నుంచి డిమాండును తెలుసుకోవాలన్నారు. ఆ మేరకు మొక్కలు సరఫరా చేసి, నాటించి, పర్యవేక్షించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న స్థలాలను అడవుల పెంపకానికి సమర్థంగా వినియోగించుకునేలా భాగస్వాములు దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ ( టెరిటోరియల్ ) వినోద్ కుమార్, డీఈవో రేణుక, ఆర్. ఐ.ఓ. ఆంజనేయులు, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, డ్వామా పిడి జోసఫ్ కుమార్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్.ఈ. రవి నాయక్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఉద్యానవనం, నీటిపారుదల, జాతీయ రహదారులకు అధికార సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)