బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇంటూరి
BSB-NEWS
కందుకూరు
2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా, రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా ఉందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించిందని, ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే అభివృద్ధి, సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ ను 3,32,205 కోట్లతో ప్రవేశపెట్టగా ఈసారి అత్యధికంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,569 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో 18,224 కోట్లు కేటాయించిందని తెలిపారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ కేటాయింపులే నిదర్శనమని అన్నారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని పాఠశాల విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ 32,308 కోట్లు ప్రకటించడం గొప్ప విషయమని ప్రశంసించారు. మొత్తంగా సంక్షేమ పథకాలకు కేటాయింపులను 41,726 కోట్ల నుంచి 53,190 కోట్లకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనిని ఆయన స్పష్టం చేశారు. బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం ఈ ఏడాది బడ్జెట్లో దాదాపు 97 వేల కోట్లు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, గత ఏడాది బడ్జెట్లో 2 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి 6,357 కోట్లు ప్రకటించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పేదలకు ఆరోగ్య భద్రతలో భాగంగా, వైద్య ఆరోగ్యశాఖలకు 38,700 కోట్లు ఇచ్చారని చెప్పారు. ప్రతి ఏడాదికి కొత్తమార్పు వచ్చేలా, అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి జరిగేలా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. విజన్ 2047 లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, యువతకు ఉపాధినిచ్చే పెట్టుబడులను ఆకర్షిస్తూ బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 12.3 శాతం వడ్డీతో ఎడాపెడా అప్పులు చేసి, ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేవలం 9 శాతం వడ్డీని చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ ఒకటిన్నర ఏడాదిలో వివిధ కేటగిరీల్లో దాదాపు 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటం ఒక రికార్డు కాగా, కానిస్టేబుల్ నుంచి డిజిపి వరకు 20 లక్షల నుండి 45 లక్షల వరకు ఉచిత భీమా కవరేజ్ కల్పించే పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకురావడం గొప్ప విషయమని అన్నారు. ఇంత మంచి బడ్జెట్ ను ప్రవేశపెడితే వైసిపి నేతలు చౌకబారు విమర్శలను చేస్తున్నారని, అది వారికి కొత్తేమీ కాదన్నారు. ఏ ప్రభుత్వం తమకు మేలు చేస్తుందో అనే విషయాన్ని ప్రజలు నిరంతరం గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు.
